Tuesday, 13 October 2015

తెలంగాణ రాజకీయాలు

తెలంగాణ రాజకీయాలు

తెలంగాణ రాష్ట్ర సమితి స్థాపకుడు మరియు తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు
1948 వరకు ఈ ప్రాంతం హైదరాబాదు రాజ్యంలో భాగంగా ఉండుటచే ఇక్కడ రాజకీయాలకు అవకాశం లేకుండేది. హైదరాబాదు రాజ్య విమోచనం అనంతరం 1952లో తొలిసారిగా ఈ ప్రాంతంలో హైదరాబాదు రాష్ట్ర శాసనసభకు మరియు తొలి లోకసభకు ఎన్నికలు జరిగాయి. అప్పుడు ఈ ప్రాంతంలో కాంగ్రెస్ పార్టీ మరియు కమ్యూనిస్టు పార్టీలు బలంగా ఉండేవి. తొలి లోకసభ ఎన్నికలలో కమ్యూనిస్టు నాయకుడు రావి నారాయణరెడ్డి దేశంలోనే అత్యధిక మెజారిటితో విజయం సాధించారు. హైదరాబాదు శాసనసభకు జరిగిన ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీకి అత్యధిక స్థానాలు లభించడంతో బూర్గుల రామకృష్ణారావు ముఖ్యమంత్రి పదవి పొందినారు. 1956 నవంబరులో ఈ ప్రాంతం ఆంధ్రప్రదేశ్‌లో భాగమైంది. 1969లో తెలంగాణ ఉద్యమం తలెత్తింది. 1971 లోకసభ ఎన్నికలలో తెలంగాణ ప్రజాసమితి పార్టీ 11 స్థానాలకు గాను పదింటిలో విజయం సాధించింది.[33] 1971-73 కాలంలో కరీంనగర్ జిల్లాకు చెందిన పి.వి.నరసింహారావు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి పదవి పొందినారు. 11 నెలల రాష్ట్రపతి పాలన అనంతరం 1973 డిసెంబరు నుంచి 1978 మార్చి వరకు ఖమ్మం జిల్లాకు చెందిన జలగం వెంగళరావు ముఖ్యమంత్రి పీఠం అధిష్టించారు. రంగారెడ్డి జిల్లాకు చెందిన తెలంగాణ ఉద్యమ నాయకుడు, తెలంగాణ ప్రజాసమితి పార్టీ నాయకుడైన మర్రి చెన్నారెడ్డి కాంగ్రెస్ పార్టీలో చేరి 1978 మార్చి నుంచి 1980 అక్టోబరు వరకు ముఖ్యమంత్రిగా కొనసాగినారు. ఆ తర్వాత 1980 అక్టోబరు నుంచి మెదక్ జిల్లాకు చెందిన టంగుటూరి అంజయ్య ముఖ్యమంత్రి పదవి పొంది 1982 ఫిబ్రవరి వరకు పనిచేశారు. 1982లో ఎన్టీ రామారావు తెలుగుదేశం పార్టీ స్థాపించడంతో 1983 ఎన్నికలలో తెలంగాణ ప్రాంతంలో కూడా తెలుగుదేశం పార్టీకి మెజారిటీ లభించింది. 1989 డిసెంబరు నుంచి 1990 డిసెంబరు వరకు మర్రి చెన్నారెడ్డి రెండోసారి ముఖ్యమంత్రిగా పనిచేశారు. ఆ తర్వాత తెలంగాణకు చెందినవారు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి పదవి పొందలేరు. 2011లో ప్రత్యేక తెలంగాణ ఉద్యమం ప్రారంభమైన పిదప దామోదర రాజనర్సింహకు ఉప ముఖ్యమంత్రి పదవి లభించింది. 2001 ఏప్రిల్‌లో తెలుగుదేశం పార్టీ నుంచి బయటకు వచ్చి ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు లక్ష్యంతో ఏర్పాటు చేసిన తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీ వల్ల తెలంగాణ రాజకీయంగా చాలా మార్పులను లోనైంది. 2004 లోకసభ ఎన్నికలలో తెరాస కాంగ్రెస్ పార్టీతో పొత్తు పెట్టుకొని 26 శాసనసభ స్థానాలు, 5 లోకసభ స్థానాలలో విజయం సాధించింది. 2009 లోకసభ ఎన్నికలలో కాంగ్రెస్ పార్టి 12, తెలుగుదేశం పార్టీ 2, తెరాస 2, ఎంఐఎం 1 స్థానాలలో విజయం సాధించాయి. 2009 శాసనసభ ఎన్నికలలో ఈ ప్రాంతంలోని 119 స్థానాలలో కాంగ్రెస్ పార్టీ మెజారిటీ స్థానాలు పొందినది. 2014 శాసనసభ ఎన్నికలలో తెలంగాణ రాష్ట్ర సమితి మెజారిటీ స్థానాలు సాధించి తెలంగాణ రాష్ట్రపు తొలి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. తెరాస అధ్యక్షుడు కె.చంద్రశేఖరరావు జూన్ 2, 2014న తెలంగాణ తొలి ముఖ్యమంత్రిగా పదవి చేపట్టారు.

No comments:

Post a Comment