Tuesday, 13 October 2015

ఆర్థిక పరిస్థితి

ఆర్థిక పరిస్థితి

హైటెక్ సిటి

తెలంగాణలో హైదరాబాదు జిల్లా ఆర్థికంగా ముందంజలో ఉండగా ఆదిలాబాదు జిల్లా వెనుకబడి ఉంది. రాష్ట్రంలోని మొత్తం జీడిపిలో సేవారంగం వాటా 59.01% ఉంది. వ్యవసాయరంగంలో 55.7% మంది పనిచేస్తుండగా, సేవారంగంలో 32.6%, పారిశ్రామిక రంగంలో 11% పనిచేస్తున్నారు.[30] హైదరాబాదు జిల్లా నుంచి సేవారంగంలో సింహభాగం వాటా లభిస్తుండగా, పారిశ్రామిక రంగం నుంచి హైదరాబాదు పరిసరాలలోని రంగారెడ్డి జిల్లా ప్రాంతం నుంచి, మెదక్ జిల్లా పటాన్‌చెరు పారిశ్రామిక ప్రాంతం నుంచి మరియు మహబూబ్‌నగర్ జిల్లా కొత్తూరు ప్రాంతం నుంచి లభిస్తుంది.

తలసరి ఆదాయం:తెలంగాణ ప్రాంతపు ప్రజల తలసరి ఆదాయం రూ.36082గా ఉన్నది. జిల్లాల వారీగా చూస్తే, హైదరాబాదులో అత్యధికంగా ఉండగా ఆదిలాబాదు, మహబుబ్‌నగర్ జిల్లాల తలసరి ఆదాయం అత్యల్పంగా ఉంది.

ఖనిజాలు: తెలంగాణలో అనేక ఖనిజ నిక్షిప్తమై ఉన్నాయి. కరీంనగర్, ఖమ్మం, వరంగల్ మరియు ఆదిలాబాదు జిల్లాలలో బొగ్గుగనులు, ఆదిలాబాదు మరియు వరంగల్ ప్రాంతాలలో ముడి ఇనుము, ఖమ్మం మరియు మహబూబ్‌నగర్ జిల్లాలలోముగ్గురాయి, రంగారెడ్డి మరియు నల్గొండ జిల్లాలలో సున్నపురాయి నిక్షేపాలు విస్తృతంగా వ్యాపించియున్నాయి.

పరిశ్రమలు: హైదరాబాదు మరియు పరిసరాలలో అన్ని రకాల పరిశ్రమలు ఉన్నాయి. రంగారెడ్డి జిల్లా తాండూరు లో, నల్గొండ జిల్లా మిర్యాలగూడ ప్రాంతంలో సిమెంటు పరిశ్రమలు అధికంగా ఉన్నాయి. మహబూబ్‌నగర్ జిల్లా కొత్తూరులో పారిశ్రామికవాడ ఉంది. మెదక్ జిల్లా పటాన్‌చెరు ప్రాంతం పారిశ్రామికంగా అభివృద్ధి చెందింది. సిర్పూర్‌లో కాగితం పరిశ్రమ, కొత్తగూడెం లో ఎరువుల పరిశ్రమ ఉన్నది.

విద్యుత్ కేంద్రాలు: 1921లో హుస్సేన్‌సాహర్ విద్యుత్ కేంద్రం స్థాపించబడింది. 1930లో నిజాంసాగర్ జలవిద్యుత్ కేంద్రం స్థాపితమైంది. 1956లో నాగార్జున సాగర్ నిర్మించిన పిదప విద్యుత్ ఉత్పత్తి ప్రారంభించారు. 1983లో శ్రీరాంసాగర్ ప్రాజెక్టు జలాశయానికి ప్రాజెక్టుగా మార్చి జలవిద్యుత్ కేంద్రంగా మార్చారు. 2011లో ప్రియదర్శినీ జూరాలా ప్రాజెక్టులో కూడా విద్యుత్ ఉత్పత్తి ప్రారంభమైంది. కొత్తగూడెంలో థర్మల్ విద్యుత్ కేంద్రం ఉంది. గట్టు ప్రాంతంలో భారీ సౌరవిద్యుత్ కేంద్రం స్థాపించడానికి సన్నాహాలు జరుగుతున్నాయి.

వ్యవసాయం: ప్రాచీన కాలంలో ముఖ్యంగా కాకతీయుల కాలంలో తెలంగాణ ప్రాంతం వ్యవసాయికంగా బాగా అభివృద్ధి చెందింది. వ్యవసాయాభివృద్ధి కోసం కాకతీయులు నిర్మించిన పలుచెరువులు నేటికీ కనిపిస్తున్నాయి. రెండొబేతరాజు కేసరి సముద్రం నిర్మించగా, గణపతిదేవుడు దేశం (తెలంగాణ) నలుమూలలా పలు భారీ చెరువులను నిర్మించినాడు. గణపతిదేవుడి సేనాని రేచర్ల రుద్రుడు ప్రఖ్యాతిగాంచిన రామప్ప చెరువును త్రవ్వించాడు. తెలంగాణ ప్రాంతంలో సువాసనలువెదజల్లే బియ్యం పండుతున్నట్లు అప్పట్లోనే సాహితీవేత్తలు పేర్కొన్నారు.[31] కుతుబ్‌షాహీ, ఆసఫ్‌జాహీల కాలంలో కూడా ఈ ప్రాంతం వ్యవసాయంలో పేరుగాంచింది. 1914లో వ్యవసాయాభివృద్ధి కోసం సహకార వ్యవస్థను ఏర్పాటుచేశారు. ఉస్మాన్ సాగర్, హిమాయత్ సాగర్, గండిపేట చెరువుల నిర్మాణం జరిగింది. ప్రస్తుతం మహబూబ్‌నగర్ జిల్లా లో వరి, జొన్నలు, కందులు, ఆదిలాబాదు జిల్లా లో ప్రత్తి, నిజామాబాదు జిల్లా లో వరి, ప్రత్తి, కరీంనగర్ జిల్లా లో వరి, ప్రత్తి, మెదక్ జిల్లా లో వరి, మొక్కజొన్న, వరంగల్ జిల్లా లో ప్రత్తి, వరి, నల్గొండ జిల్లా లో వరి, ప్రత్తి, రంగారెడ్డి జిల్లా లో వరి, కందులు అధికంగా పండుతాయి.

No comments:

Post a Comment