తెలంగాణ సాహిత్యం
ప్రాచీనకాలం నుంచే తెలంగాణ ప్రాంతంలో సాహిత్యం విలసిల్లింది.
ఆలంపూర్‌కు చెందిన మంథాన భైరవుడు 10వశతాబ్దంలోనే ప్రసిద్ధ "భైరవతంత్రం"అనే సంస్కృత గ్రంథం రచించాడు.
[42] 13వ శతాబ్దిలో
గోన బుద్ధారెడ్డి "రంగనాథ రామాయణం" ద్విపద ఛందస్సులో రచించాడు. ఇది తొలి తెలుగు రామాయణంగా ప్రసిద్ధి చెందినది. గోన బుద్ధారెడ్డి సోదరి
కుప్పాంబిక తొలి తెలుగు కవయిత్రిగా ఖ్యాతి పొందింది. ఈమె వేయించిన బూదపురం శాసనం నేటి
భూత్పూర్‌లోని దేవాలయంలో ఉంది. తెలంగాణ సాహిత్యంలో
కాకతీయ యుగం స్వర్ణయుగంగా భావించబడుతుంది.
గణపతిదేవుని
బావమరిది జాయపసేనాని నృత్యరత్నావళిని రచించాడు. తొలిసారిగా స్వతంత్ర రచన
చేసిన పాల్కుర్కి సోమనాథుడు తెలుగు సాహిత్యంలోనే ఆదికవిగా నిలిచాడు.
[43] వేములవాడ భీమకవి ఈ కాలం నాటివాడే. 13వ శతాబ్దికే చెందిన
బద్దెన కాకతీయుల కాలంలో
సుమతీ శతకము రచించాడు. తొలి పురాణ అనువాద మహాకవి
మారన ఇదే కాలానికి చెందినవాడు. ప్రతాపరుద్రుని ఆస్థానకవి
విద్యానాథుడు
రచించిన పలు గ్రంథాలలో ప్రతాపరుద్ర యశోభూషణం ప్రఖ్యాతిచెందింది. మూడు తరాల
కాకతీయ చక్రవర్తుల వద్ద మంత్రిగా పనిచేసిన శివదేవయ్య కూడా మహాకవి. 14వ
శతాబ్దికి చెందిన కాచ-విఠలులు తొలి తెలుగు జంటకవులుగా ప్రసిద్ధి చెందారు.
చమత్కార చంద్రిక రచించిన
విశ్వేశ్వరుడు
కూడా 14వ శతాబ్దికి చెందిన కవి. తెలుగులో తొలి యక్షగాన రచయిత సర్వజ్ఞ
సింగభూపాలుడు కూడా ఇదే కాలానికి చెందినవాడు. అనపోత నాయకుని కుమారుడు రెండో
సింగభూపాలుడు స్వయంగా కవి, బహుముఖ ప్రజ్ఞాశాలి. విజయనగర రాజు బుక్కరాయల
కోడలైన గంగాదేవి కాకతీయుల ఆడబిడ్డ, ఈమె కవయిత్రిగా పేరుపొందింది.
[44] తొలి తెలుగు వచనకర్త కృష్ణమాచార్యులు కూడా 14వ శతాబ్దికి చెందినవాడు. కాకతీయ చక్రవర్తి
గణపతి దేవుడు
స్వయంగా కవి అయి శివయోగసారం లాంటి పలు రచనలు చేశాడు. సింహాసన ద్వాత్రింశిక
రచించిన కొరవి గోపరాజు కూడా ఇదే కాలానికి చెందినవారు. సిగ్మండ్ ప్రాయిడ్
కంటే ముందే మానసిక సమస్యలు విశ్లేషించిన వాడిగా గోపరాజు ప్రఖ్యాతిచెందారు.
చిత్రవిచిత్రాలతో కూడిన "చిత్రభారతం" రచయిత
చరిగొండ ధర్మన్న 15-16వ శతాబ్దికి చెందిన ప్రముఖ కవి.
కాకతీయ సామ్రాజ్య పతనానంతరం తెలంగాణలో తెలుగు సాహిత్య ప్రభ తగ్గిననూ
మరింగంటి సింగరాచార్యులు తన కవిత్వంతో ఇబ్రహీం కుతుబ్‌షానే మెప్పించి
అగ్రహారాన్ని పొందాడు. అప్పటి కవులు ఇతనిని మల్కిభరాముడని అభివర్ణించారు.
ఇబ్రహీం కుతుబ్‌షా ఆస్థానకవి
అద్దంకి గంగాధరుడు
ప్రతిభావంతుడైన కవి. ఇతను రచించిన తపతి సంవర్ణోపాఖ్యానం
ప్రఖ్యాతిచెందింది. పొన్నెగంటి తెలగనాచార్యుడు 16వ శతాబ్దికి చెందినకవి.
కులీకుతుబ్‌షా ఫారసీ కవులను ఆదరించాడు. ఇతని కాలంలో ఫారసీ, ఉర్దూలలో పలు
రచనలువెలువడ్డాయి. కులీకుతుబ్‌షా సంస్కృత "శుకసప్తతి"ని "యాతినామా" పేరుతో
ఫారసీలోకి అనువాదం చేయించాడు. ఈ కాలంలోనే దోమకొండ సంస్థానం సాహిత్యానికి
పేరుగాంచింది. 1600 ప్రాంతానికి చెందిన కాసె సర్వప్ప "సిద్దేశ్వర చరిత్ర"
రచించాడు. సురభి మాధవరాయల ఆస్థానకవి
ఎలకూచి బాలసరస్వతి తెలుగులోనే మొట్టమొదటి మహామహోపాధ్యాయ కవిగా గణతికెక్కాడు. కొందరు గుంటూరు జిల్లా కవిగా భావించే
కాకునూరి అప్పకవి తెలంగాణ వాడేనని బూర్గుల నిరూపించాడు. తానీషా వద్ద పనిచేసే అక్కన్న-మాదన్నల మేనల్లుడు
కంచెర్ల గోపన్న (భక్తరామదాసు) కీర్తనలు తెలుగువారికి శతాబ్దాల నుంచి సుపరిచితమే.
తెలంగాణ భాషలో కవితలద్దిన కాళోజీ
ఆసఫ్‌జాహీల కాలంలో (1724-1948) తెలంగాణ సాహిత్యం కుంటుపడింది.
తెలుగుభాషను అణగద్రొక్కి బలవంతంగా ప్రజలపై ఉర్దూభాష రుద్దడం, తెలుగు కవులకు
ఎలాంటి ప్రోత్సాహం లేకపోవడంతో కాకతీయుల కాలంలో వెలుగులు విరజిమ్మిన
తెలంగాణ సాహిత్యం ఆసఫ్‌జాహీలకాలంలో దారుణంగా దెబ్బతిన్నది. అక్కడక్కడా
తెలుగులో రచించిన గ్రంథాలు కూడా వెలుగులోకి రాకుండా చేశారు. ఈ కాలంలో
స్థానిక స్థల మహత్మ్యాలు, దేవాలయ చరిత్రల విశేషాలు రచించినవి తర్వాతి
కాలంలో బయటపడ్డాయి. భజనకీర్తనలు కూడా ఈ కాలంలో వ్రాయబడ్డాయి.
మన్నెంకొండ హనుమద్దాసు,
రాకమచర్ల వేంకటదాసు,
వేపూరు హనుమద్దాసు
ఈ కాలంలోని సంకీర్తన త్రిమూర్తులుగా పరిగణించబడతారు. రాజవోలు ప్రభువు
ముష్టిపల్లి వేంకటభూపాలుడు వేలాది సంకీర్తనలు రచించాడు. ఆసఫ్‌జాహీలు
స్వయంగా కవిపండితులకు ఆదరణ ఇవ్వకున్ననూ స్వతంత్రంగా పాలన కొనసాగించిన
సంస్థానాలలో మాత్రం సాహిత్యం బాగా అభివృద్ధి చెందింది. ముఖ్యంగా ఆధునిక
కాలంలో కవిపండితులకు నిలయమైన గద్వాల సంస్థానం ప్రత్యేకతను కలిగియుంది.
సాహితీవేత్తలు ఈ సంస్థానాన్ని విద్వత్గద్వాలగా అభివర్ణించేవారు. గద్వాల
సంస్థానాధీశూలు కూడా స్వయంగా కవులుగా ఉండి పలు రచనలు చేశారు. తరుచుగా
కవితాగోష్టులు నిర్వహించేవారు. గద్వాల సంస్థానాధీశులు కవులను ఎంతగా
అభిమానించేవారంటే, వారి కోసం ఒక ప్రత్యేక ద్వారాన్నే ఏర్పాటు చేసి, వారు
నడిచే మార్గంలో తెల్లటి వస్త్రాన్ని పరిచి, కవిపండితుల పాదధూళిని భరిణెలో
భద్రపర్చి వాటిని తిలకంగా నుదుటికి పెట్టుకొనేవారు. గద్వాల సంస్థానంతో పాటు
పరిసర సంస్థానాలైన వనపర్తి సంస్థానం, జటప్రోలు సంస్థానాధీశూలు కూడా గద్వాల
సంస్థానంతో పోటీపడ్డారు. వీరి మధ్య తరుచుగా కవితా గోష్టులు జరిగేవి.
తిరుపతి వేంకటకవులను కూడా ఓడించిన ఘనత వనపర్తి సంస్థాన కవులకు దక్కింది.
1920 తర్వాత తెలంగాణలో నీలగిరి, గోల్కొండ పత్రిక లాంటి తెలుగు పత్రికలు
రాకతో సాహిత్యం మరింత అభివృద్ధి చెందింది. అదివరకు వెలుగులోకి రాని కవులు,
వారి రచనలను సురవరం ప్రతాపరెడ్డి తన గోల్కొండ పత్రికలోనే, దానికి అనుబంధమైన
సుజాత సాహిత్య పత్రికలోనూ ప్రచురించేవారు. తెలంగాణలో కవులే లేరనే ఒక
ఆంధ్రుడి సవాలును తీసుకొని 356 కవుల చరిత్ర, వారి రచనలతో "గోల్కొండ కవుల
సంచిక" పేరుతోఒక గ్రంథాన్నే ప్రజల ముందుకు ఉంచిన తెలంగాణ వైతాళికుడు సురవరం
ప్రతాపరెడ్డి. తెలుగులో తొలి సాహిత్య అకాడమీ అవార్డు కూడా ఇతనికే
లభించింది. గ్రంథాలయోద్యమం సమయంలో ప్రతి ప్రాంతంలో గ్రంథాలయాలు ఏర్పాటు
చేయడం, సాహిత్య గ్రంథాలు ఉంచడంతో సాహితీ అభిమానులు కూడా అధికమయ్యారు.
దాశరథి కృష్ణమాచార్య,
దాశరథి రంగాచార్య లాంటి కవులు నిజాం దురాగతాలను ఎలగెత్తడానికి పద్యాలనే ఆధారం చేసుకోగా,
కాళోజీ నారాయణరావు తెలంగాణ భాషలోనే కవితలు చేసి ప్రజలను జాగృతం చేశారు.
వట్టికోట ఆళ్వారుస్వామి,
మందుముల నరసింగరావు,
బూర్గుల రామకృష్ణారావు లాంటి వారు విమోచనోద్యమ కాలంలోనే సాహిత్య రచన చేశారు.
సామల సదాశివ
బహుభాషావేత్త, సాహిత్య అకాడమీ అవార్డు గ్రహీత. జ్ఞాన్‌పీఠ్ అవార్డు గ్రహీత
సి.నారాయణరెడ్డి ఆధునిక తెలుగు సాహితీవేత్తలలోనే అగ్రగణ్యులుగా ప్రసిద్ధి
చెందారు.
నందిని సిద్ధారెడ్డి,
అందెశ్రీ,
గోరటి వెంకన్నలు తెలంగాణపై కవితలు రచించారు
No comments:
Post a Comment