Tuesday 13 October 2015

jai telangana

భారతదేశంలోని 29 రాష్ట్రాలలో ఒకటి తెలంగాణ. దేశానికి స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత కూడా స్వతంత్ర రాజ్యాలుగా కొనసాగిన వాటిలో హైదరాబాద్ ఒకటి. నిజాం పాలన నుంచి 1948 సెప్టెంబరు 17న విముక్తి చెంది హైదరాబాదు రాష్ట్రంగా ఏర్పడి, 1956లో భాషా ప్రయుక్త రాష్ట్రాల ఏర్పాటులో భాగంగా కన్నడ, మరాఠి మాట్లాడే ప్రాంతాలు కర్ణాటక, మహారాష్ట్ర లకు వెళ్ళిపోగా, తెలుగు భాష మాట్లాడే జిల్లాలు అప్పటి ఆంధ్ర రాష్ట్రం తో కలిసి ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంగా ఏర్పడింది. ప్రస్తుతము తెలంగాణ రాష్ట్రంలో 10 జిల్లాలు ఉన్నాయి. భౌగోళికంగా ఇది దక్కను పీఠభూమి లో భాగము. దేశంలోనే పొడవైన 44వ నెంబరు (శ్రీనగర్-కన్యాకుమారి) జాతీయ రహదారి (జాతీయ రహదారి 7 కన్యాకుమారి-వారణాసి మరియూ జాతీయ రహదారి 44 కలిసి ఉంటాయి), 65వ నెంబరు (పూణె-విజయవాడ) జాతీయ రహదారి, హైదరాబాదు-భూపాలపట్నం జాతీయ రహదారి 202, నిజామాబాదు-జగదల్‌పూర్ జాతీయ రహదారులు ఈ రాష్ట్రం గుండా వెళ్ళుచున్నవి. హైదరాబాదు-వాడి, సికింద్రాబాదు-కాజీపేట, సికింద్రాబాదు-విజయవాడ, సికింద్రాబాదు-డోన్, వికారాబాదు-పర్బని,కాజీపేట-బల్హర్షా, గద్వాల-రాయచూరు రైలుమార్గాలు తెలంగాణలో విస్తరించియున్నాయి. సికింద్రాబాదు, కాజీపేట రైల్వే జంక్షన్లు దక్షిణ మధ్య రైల్వే లో ప్రముఖ కూడళ్ళుగా పేరెన్నికగన్నవి. తెలంగాణ రాష్ట్రం ఉత్తరాన మహారాష్ట్ర సరిహద్దు నుంచి దక్షిణాన ఆంధ్రప్రదేశ్‌లోని రాయలసీమ ప్రాంతం వరకు, పశ్చిమాన కర్ణాటక సరిహద్దు నుంచి తూర్పున ఆంధ్రప్రదేశ్‌లోని కోస్తాంధ్ర ప్రాంతం వరకు విస్తరించియుంది. తెలుగులో తొలి రామాయణ కర్త గోన బుద్ధారెడ్డి, సహజకవి బమ్మెర పోతన, దక్షిణ భారతదేశంలో తొలిమహిళా పాలకురాలు రుద్రమదేవి, ప్రధానమంత్రిగా పనిచేసిన పి.వి.నరసింహారావు తెలంగాణకు చెందిన ప్రముఖులు. చరిత్రలో షోడశ మహాజనపదాలలో ఒకటైన అశ్మక జనపదం విలసిల్లిన ప్రాంతమిది. కాకతీయుల కాలంలో వైభవంగా వెలుగొందిన భూభాగమిది. రామాయణ-మహాభారత కాలానికి చెందిన చారిత్రక ఆనవాళ్ళున్న ప్రదేశమిది. తెలంగాణ రాష్ట్రపు మొత్తం వైశాల్యం 1,14,840 చ.కి.మీ, కాగా 2011 లెక్కలప్రకారం జనాభా 35,286,757గా ఉంది. 17లోకసభ స్థానాలు, 119 శాసనసభ స్థానాలు ఈ రాష్ట్రంలో ఉన్నాయి. మహబూబ్‌నగర్ జిల్లా ఆలంపూర్ లో 5వ శక్తిపీఠం, మల్దకల్ శ్రీస్వయంభూ లక్ష్మీవెంకటేశ్వరస్వామి దేవస్థానం, భద్రాచలం లో శ్రీసీతారామాలయం, బాసర లో సరస్వతీ దేవాలయం, యాదగిరి గుట్ట లో శ్రీలక్ష్మీనరసింహస్వామి ఆలయం, వేములవాడ లో శ్రీరాజరాజేశ్వరస్వామి ఆలయం,మెదక్ లో ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన చర్చి, ఉన్నాయి.[2] దశాబ్దాలుగా సాగుతున్న ప్రత్యేక తెలంగాణ ఉద్యమం 1969లో ఉధృతరూపం దాల్చగా, 2011లో మరో సారి తీవ్రరూపం దాల్చింది. ప్రత్యేక తెలంగాణ ఉద్యమంలో భాగంగా వందలాది మంది ఆత్మహత్యలు చేసుకొన్నారు. 2010లో తెలంగాణ అంశంపై శ్రీకృష్ణ కమిటీ ని నియమించగా ఆ కమిటి ఆరు ప్రతిపాదనలు చేసింది. 2013, జూలై 30న ప్రత్యేక తెలంగాణకై కాంగ్రెస్ వర్కింగ్ కమిటి తీర్మానం చేయగా, 2013 అక్టోబరు 3న కేంద్ర మంత్రిమండలి ఆమోదించింది. 2014, ఫిబ్రవరి 18న తెలంగాణ ఏర్పాటు బిల్లుకు భారతీయ జనతా పార్టీ మద్దతుతో లోకసభ ఆమోదం లభించగా, ఫిబ్రవరి 20న రాజ్యసభ ఆమోదం పొందింది. మార్చి 1, 2014న బిల్లుపై రాష్ట్రపతి ఆమోదం లభించింది.[3] జూన్ 2, 2014 నాడు తెలంగాణ దేశంలో 29వ రాష్ట్రంగా నూతనంగా అవతరించింది.[4][5]

No comments:

Post a Comment